కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని
కొండవీడు ఉత్సవాల్లో భాగంగా జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు అనే అంశంపై కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు,రాష్ట్ర గ్రంథాలయ కమిషన్ చైర్మన్ కోటేశ్వరరావు, రాష్ట్ర శిల్పారామం చైర్‌పర్సన్ మంజులా రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర సీనియర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.కొండవీడు సామ్రాజ్య వైభవ చరిత్రను స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు రోజుల కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, సీబీసీ ‘వందేమాతరం – 150 సంవత్సరాలు’ ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
వందేమాతరం గీతం గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరింత అవగాహన పెంపొందించుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పిలుపునిచ్చారు. యావత్ దేశాన్ని ఒక్కతాటిపై నిలిపి, ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన సమయంలో, బంకిమ్ చంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ రూపంలో అద్భుతమైన, ఆశాజనకమైన గీతాన్ని అందించారని పేర్కొన్నారు. వందేమాతరం గీతంలోని ప్రతి పదం నేటికీ ప్రేరణనిచ్చేదిగా, వికసిత్ భారత్ సాధనకు మార్గదర్శకంగా ఉందని తెలిపారు.
సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఆర్. రమేశ్ చంద్ర మాట్లాడుతూ,ఈ ప్రదర్శనలో బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ జీవితానికి సంబంధించిన అరుదైన, విశిష్ట చిత్రాలు, అలాగే వందేమాతరం జాతీయ గీతానికి సంబంధించిన చారిత్రక విశేషాలను ప్రదర్శించామని తెలిపారు. మొదటి రోజే వివిధ పాఠశాలలకు చెందిన వెయ్యికి పైగా విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారని చెప్పారు. విద్యార్థుల కోసం తక్షణ వందేమాతరం క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామని ఆయన తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY