బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి కృషిచేద్దాం
- పిల్లల బంగారు భవిష్యత్తుకు చేయీచేయీ కలుపుదాం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
బాల్య వివాహ రహిత జిల్లాగా ఎన్‌టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలని, పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు నిబద్ధతతో కృషిచేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
వాసవ్య మహిళా మండలి (వీఎంఎం) – బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకం చేసి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా వాసవ్య మహిళా మండలి ఓ మంచి కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. వసుధైవ కుటుంబంలో భాగమైన మనందరం బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, బాల్య వివాహాలు జరక్కుండా కలిసికట్టుగా కృషిచేయాల్సి ఉందన్నారు.
చట్టాలను గౌరవిస్తూ, నిబంధనలు పాటిస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రచార రథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టాలుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. చైల్డ్ హెల్ప్‌లైన్ (1098), ఉమెన్ హెల్ప్‌లైన్ (181) కూడా అందుబాటులో ఉన్నాయని.. ఎవరైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చన్నారు. ఈ ప్రచార రథం ద్వారా బాల్య వివాహాలపై అవగాహన కల్పించడంతో పాటు లక్ష మందికి పైగా ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ వాసవ్య మహిళా మండలి బృందానికి సూచించారు.
కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డా. బి.కీర్తి, ప్రాజెక్టు డైరెక్టర్ రామానుజయ, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ ఎం.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY