పోలీస్, రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలి : బాధితురాలు వెన్న పూలమ్మ
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: తమ భూమి విషయంలో అన్యాయం జరుగుతోందని, పోలీస్,రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని పెన్ పహడ్ మండలం చీదేళ్ల గ్రామానికి చెందిన వెన్న పూలమ్మ డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె తన వేదనను కన్నీళ్లతో వెల్లడించారు. ఈ సందర్భంగా పూలమ్మ మాట్లాడుతూ కుప్పిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మందడి శ్రీరాంరెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్న సమయంలో పసుపు కుంకుమల కింద 1.20 ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు. అనంతరం మరో రెండు ఎకరాల భూమిని తామే కొనుగోలు చేశామని చెప్పారు.
ప్రస్తుతం మొత్తం మూడు ఎకరాలకుపైగా భూమిని కౌలుకు ఇచ్చి జీవనం సాగిస్తున్నామని వివరించారు. సర్వే నంబర్ 119లో 2.20 ఎకరాలు, మరో సర్వే నంబర్‌లో 1.30 ఎకరాల భూమి తమకుందని ఆమె తెలిపారు. అయితే తమ తమ్ముళ్లు మందడి గోపాల్‌రెడ్డి, మందడి పద్మారెడ్డిలు భూమి వద్దకు వెళ్లనివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు అన్ని ఆధారాలు చూపించినా పట్టించుకోవడం లేదని, అధికారుల నిర్లక్ష్యంతో తాము తీవ్రంగా బాధపడుతున్నామని పూలమ్మ వాపోయారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. అధికారులు స్పందించకపోతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆమె హెచ్చరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY