నగరిని కుప్పంలా అభివృద్ధి చేస్తా
** 50ఏళ్ల క్రితం ఇక్కడే రాజకీయం ప్రారంభించా
** నగరి “స్వచ్చాంధ్ర” సభలో సీఎం చంద్రబాబు
సాక్షిత ప్రతినిధి – నగరి / తిరుపతి: చిత్తూరు జిల్లాలో కుప్పం తర్వాత నగరి నియోజకవర్గాన్ని కూడా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణాంధ్రా కార్యక్రమంలో భాగంగా నగరిలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. 1978లో ఇదే చిత్తూరు జిల్లానుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. అందుకు నిబద్ధత, పట్టుదల, ఒడిదుడుకులు ఎదుర్కొనే ఓపిక, క్రమశిక్షణ, మంచి చేయాలన్న తపనే కారణాలన్నారు. నగరి అభివృద్ధికి గతంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాదిరిగానే ఇప్పుడు గాలి భానుప్రకాష్ కూడా నిరంతరం శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. అందుకోసమే నగరికి ఈ ఒక్క సందర్భంలోనే సుమారు 600కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు.
అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జిల్లా ఇన్ చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ తదితరులు కూడా ప్రసంగించారు. ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే స్వర్ణాంధ్రా సాధ్యమని ఉద్ఘాటించారు. స్వర్ణాంధ్రా- స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం ఆద్యులు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని మనమంతా బలపరచాలని చిత్తూరు ఎంపీ నగరి ప్రజలకు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర సాధనే ద్యేయంగా ఎంచుకొని, అభివృద్ధి -సంక్షేమం రెండు కళ్ళుగా భావించి, ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే మనందరి ప్రథమ కర్తవ్యం అని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఉద్బోధించారు. స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్ర వంటి బృహత్తర కార్యక్రమాలకు ఆజ్యం పోసి, వాటిని నిరంతరం నిర్వహిస్తూ.., ప్రజలను చైతన్య పరుస్తున్న నిజమైన ప్రజా సేవకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఉన్నత ఆశయంతో తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని సమన్వయముతో ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేద్దామని, తద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేద్దామని ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు నగరి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY