నేతాజీ జయంతి సందర్భంగా గురుకుల పాఠశాలలో క్విజ్ పోటీ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల బాలికల పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరుడు కొండేటి వేణుగోపాల్ రెడ్డి సేవాసమితి వ్యవస్థాపకులు కుసుమ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినీలకు “జాతీయోద్యమం – జాతీయ నాయకుల చరిత్ర” అంశంపై అవగాహన సదస్సు, క్విజ్ పోటీలు నిర్వహించి జాతీయ నాయకులపై రచించిన పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా కుసుమ సిద్ధారెడ్డి మాట్లాడుతూ… “నేతాజీ వంటి మహానీయుల జీవితాలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. బాలికలు క్రమశిక్షణతో చదువుతూ జాతీయ భావాలు, సేవాభావం అలవర్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి” అని సూచించారు.
దేశభక్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వం విద్యార్థులలో పెంపొందాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొని క్విజ్ పోటీల్లో తమ ప్రతిభను చాటారు. జాతీయ నాయకుల జీవితం, త్యాగాలు, దేశ స్వాతంత్ర్యానికి వారు చేసిన పోరాటాలపై అవగాహన పెరిగిందని పలువురు విద్యార్థినీలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ధనమ్మ, ఉపాధ్యాయులు ఫర్జన, రమణ, అనిత, ప్రియాంక, సమత, సంధ్య, సిరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గురుకుల బాలికల పాఠశాల వేదికగా జాతీయ చైతన్యానికి ఊతమిచ్చిన ఈ కార్యక్రమం విద్యార్థినీలలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా నిలిచిందనీ పలువురు పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY