డాక్టర్ చాంద్ బాషా దావుల్జీకి ప్రతిష్టాత్మక ‘నెసా’ ఫెలోషిప్ అవార్డు-2025
తిరుపతి
*తిరుపతిలోని పాథ్‌జీన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రిన్సిపల్, సైంటిస్ట్ డాక్టర్ చాంద్ బాషా దావుల్జీకి ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ (ఎన్.ఇ.ఎస్.ఎ) ఫెలోషిప్ అవార్డు-2025 లభించింది. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఐసిఏఆర్-రీసెర్చ్ కాంప్లెక్స్ ఫర్ ఈస్టర్న్ రీజియన్ లో జనవరి 22 న జరిగిన ‘ఎన్విరాన్‌మెంటల్ స్టివార్డ్‌షిప్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ -2026) జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. పర్యావరణ విజ్ఞాన శాస్త్రంలో దశాబ్దానికి పైగా విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అకాడమీ అందించే అత్యున్నత పురస్కారాలలో ఈ ‘నెసా’ ఫెలోషిప్ ఒకటి. గత 10 ఏళ్లుగా పర్యావరణ కాలుష్యం, అది మానవ ఆరోగ్యంపై చూపే ప్రభావం అనే అంశంపై డాక్టర్ చాంద్ బాషా చేసిన పరిశోధనలకు గాను ఈ గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ లక్ష్యాలకు అనుగుణంగా, ప్రజారోగ్యాన్ని రక్షించే నివారణా చర్యలపై ఆయన పరిశోధనలు విలువైన సమాచారాన్ని అందించాయి.
అవార్డు స్వీకరించిన అనంతరం డాక్టర్ చాంద్ బాషా మాట్లాడుతూ నా పరిశోధన ప్రయాణంలో నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన నా గురువు, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రాజారామి రెడ్డికి, తిరుపతి పాథ్‌జీన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ రహమతుల్లాకి, ఎస్వీ యూనివర్సిటీలోని ఇతర అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY