గణతంత్ర స్ఫూర్తితో వేడుకలకు సిద్ధంకండి
- ప్రగతి పథం, ప్రజలను చైత్యవంతులను చేసేలా శకటాల ప్రదర్శన
- అధికారులు సమన్వయంతో పనిచేయండి
- ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 26న విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ప్రపథంగా ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ… జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకలకు పటిష్టమైన, విస్తృత ఏర్పాట్లు చేయాలని..
ఏడాది కాలంలో ప్రగతి పథాన్ని, సాధించిన విజయాలకు అద్దం పట్టేలా ప్రజలను చైతన్యవంతులను చేసేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ @ 2047, నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు, మహిళా సాధికారత, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సాంకేతికత, పారిశ్రామిక ప్రగతి, వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్.. ఇలా వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వేదిక ఏర్పాట్లు, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, భద్రతా చర్యలు, ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజల్లో దేశభక్తి, ఐక్యత భావనను పెంపొందించేలా, ప్రజలను జాగృతం చేసి అభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఉండాలన్నారు. జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొననున్న దృష్ట్యా పటిష్టమైన బందో బస్తుతో పాటు సీటింగ్, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, కవాతు నిర్వహణ తదితరాలపై దృష్టిపెట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, రెవెన్యూ, పోలీస్, విద్య, గృహ నిర్మాణం, డీఆర్‌డీఏ, వ్యవసాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY