బ్యాంకులు అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి
సూర్యాపేట జిల్లా/చిలుకూరు, సాక్షిత :
బ్యాంకులు అందిస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌బీఐ డీజీఎం దేవిప్రియ సూచించారు. చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం గ్రామంలో జన సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇతర సామాజిక భద్రతా పథకాలపై అవగాహన పెంచుకొని వాటిలో నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు వెల్లడించవద్దని ప్రజలకు సూచించారు. బ్యాంకులు అందిస్తున్న వివిధ పథకాల గురించి తెలుసుకొని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అనారోగ్య సమస్యలతో మృతి చెందిన పోలేనిగూడెం గ్రామానికి చెందిన తిరగమల్ల కళావతి, కొండాపురం గ్రామానికి చెందిన పిల్లుట్ల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబ సభ్యులైన తిరగమల్ల వెంకటేశ్వర్లు, పిల్లుట్ల లక్ష్మికి ఈ చెక్కులను అందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌బీఐ ఏజీఎం చిరంజీవి, సూర్యాపేట ఎల్‌డీఎం నాగ వెంకటప్రసాద్, ఆర్‌బీఓ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మేనేజర్ మూర్తి, ఎస్‌బీఐ బేతవోలు బ్రాంచ్ మేనేజర్ లాల్‌సింగ్, విడ్స్ సీసీ నాగరాజు, కోదాడ, మునగాల ప్రాంతాలకు చెందిన వివిధ బ్యాంకుల మేనేజర్లు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
