ఎస్సీ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Sakshitha news

ఎస్సీ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పదోన్నతులు, ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణం కమిటీ హాల్‌లో శాసన మండలి షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ డాక్టర్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన కమిటీ సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ఎస్సీ ఉప ప్రణాళిక కింద కేటాయిస్తున్న నిధుల వినియోగం తదితర కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ… షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు.

రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగా పారదర్శకత పాటించాలని ఆయన అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా, ఎస్సీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులు లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించబడేలా పర్యవేక్షణ ఉండాలని, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన, అణగారిన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడానికి శాసనసభ కమిటీలు చేసే సమీక్షలు కీలకమని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు శ్రీ వెడ్మా బొజ్జు, శ్రీ మందుల సామ్యూల్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, విజయుడు, ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బస్వ జు సారయ్య, గోరటి వెంకన్న, ఎస్సీ శాఖ కార్యదర్శి శ్రీమతి ఇంద్రవిజేంద్ర బోయి ఐఏఎస్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి శ్రీ గుగులోత్ రవి ఐఏఎస్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సుధాకర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.