పత్తిపాక రిజర్వాయర్‌కు లైన్ క్లియర్.. డీపీఆర్‌కు మార్గం సుగమం…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి వరప్రదాయినిగా మారనున్న ప్రాజెక్టు…
సాక్షిత న్యూస్–పెద్దపల్లి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 30: పెద్దపల్లి జిల్లా రైతుల చిరకాల స్వప్నమైన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి ఎట్టకేలకు మార్గం సుగమమైందని పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ తెలిపారు. కేంద్ర జల సంఘం నిబంధనల ప్రకారం ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మేడిపల్లి సత్యం, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారని మహేష్ తెలిపారు.
పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలో సుమారు 2.40 లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలో మరో 40 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుందని వివరించారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో మరో 10 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.
అలాగే కాకతీయ కాలువకు చెందిన ప్రధాన కాలువలు డీ-83, డీ-94లకు కూడా ఈ రిజర్వాయర్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి ఎంతో మేలు చేకూరి, వ్యవసాయ రంగానికి మరింత భరోసా కలుగుతుందని ఇరికి మహేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టౌన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బాదె రవితేజ, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY