కూల్చివేతలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

Sakshitha news

కూల్చివేతలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి….
“వికాసం నుంచి విధ్వంసం వైపు వెళ్లొద్దు”….

– ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు సీపీఐ నాయకుల డిమాండ్….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతలు, అనంతరం నిర్మాణాల విషయంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి, సమగ్రంగా నిజనిర్ధారణ చేయాలని సీపీఐ నాయకులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ను డిమాండ్ చేశారు.

గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోశిక మోహన్, సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, తిలక్‌నగర్ శాఖ కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ మాట్లాడారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒకవైపు నిర్మాణాలను కూల్చివేసి, మరోవైపు అదే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకోవచ్చని నోటిమాట ద్వారా చెప్పడం, అనంతరం మళ్లీ కూల్చివేతలకు పాల్పడటం పరిపాటిగా మారిందని వారు విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం “విధ్వంసం నుంచి వికాసం వైపు” ప్రయాణిస్తున్నామని చెబుతుంటే, రామగుండంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అన్నారు.
ఎల్‌బీనగర్ కాంప్లెక్స్‌పై నిజనిర్ధారణ చేయాలి
ఎల్‌బీనగర్ కాంప్లెక్స్ విషయంలో అక్రమ నిర్మాణాలపై ముందుగా సమగ్ర విచారణ చేయకుండా హుటాహుటిన కాంప్లెక్స్‌ను కూల్చివేశారని సీపీఐ నాయకులు ఆరోపించారు. అనంతరం బాధితులతో మాట్లాడి వారికి రూములు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ముందుగానే విచారణ జరిపి ఉంటే నిర్మాణాలను కూల్చివేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

కూల్చివేతల కారణంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. కాంప్లెక్స్‌లో రూముల కేటాయింపులో పారదర్శకత పాటించారా? ఏ విధివిధానాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశారో కార్పొరేషన్ అధ్యక్షుడు, స్థానిక కార్పొరేటర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అర్హులందరికీ న్యాయం చేయాలి
కూల్చివేతల సమయంలో యజమానులకు కాకుండా ఉపాధి కోల్పోయిన రెంటర్లకు రూములు ఇస్తామని చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొంతమంది యజమానులకు, మరికొంతమంది రెంటర్లకు రూములు కేటాయించారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా అర్హులందరినీ గుర్తించాలని కోరారు.

కాంప్లెక్స్ కోసం ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన బాధితులను నష్టపరచడం తమ ఉద్దేశం కాదని, అవసరమైతే మరికొంత స్థలాన్ని కేటాయించి అర్హులైన వారందరికీ రూములు ఇవ్వాలని సూచించారు. యజమానులకు, రెంటర్లకు న్యాయమైన ప్రాతిపదికన కేటాయింపులు జరపాలని కోరారు.

అఖిలపక్ష కమిటీతో నిజనిర్ధారణ చేయాలి
ఎల్‌బీనగర్‌తో పాటు తిలక్‌నగర్, రాజేష్ థియేటర్, బస్టాండ్ కాలనీ, ఓల్డ్ అశోక్ తదితర ప్రాంతాల్లోనూ కూల్చివేతలు, నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై అఖిలపక్ష కమిటీ ద్వారా నిజనిర్ధారణ చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

ప్రజలకు స్పష్టమైన విధివిధానాలు, లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా ప్రకటించాలని కోరారు. నిర్మాణాలకు అనుమతి ఉందా? అక్రమమని నోటీసులు జారీ చేశారా? అనే విషయాలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేయాలని అన్నారు.

“లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక్కరికి అన్యాయం జరిగినా సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభిస్తాం” అని నాయకులు హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ఆశాల నవీన్, అబ్దుల్ కరీం, గంగారపు చంద్రయ్య, బూడిది మల్లేష్, సాదుల శివ, ఈశ్వర్, అనూప్ సాయి, బాధితులు దశరథం, రమేష్, శ్రీనివాస్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top