కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,కొత్తగూడెం/ : సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు గత వారం రోజులుగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట కొనసాగిస్తున్న నిరసన దీక్షకు స్పందన రాకపోవడంతో, నుంచి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
ఈ దీక్షకు సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు దానాడ రాజు, ఓం ప్రకాష్, కొల్లిపాక అన్వేష్, గుర్రం సుధాకర్, దిశ్బాబు, రెక్కు శ్రావణ్, రేపాక కలావతి, భాగ్యలక్ష్మి తదితరులు దీక్షా శిబిరంలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
బాధితులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబాలు అన్యాయానికి గురవుతున్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించి, బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని వారు సింగరేణి యాజమాన్యం మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీక్షా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు సంఘీభావం తెలుపుతూ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఐఐటీయూసీ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా లక్కా శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధితులు అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మరియు ప్రజలు తమ న్యాయపోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
