విద్యార్థుల భద్రతపై షీ టీమ్ అవగాహన….
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన పెంచుకోవాలి….
–షీ టీమ్ ఎస్ఐ లావణ్య…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : విద్యార్థులు మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల ప్రభావం, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రగతినగర్‌లోని ఎంఫీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య ఉన్న తేడాను వివరించారు.
తెలియని వ్యక్తులతో ఎలా మెలగాలి, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు.
పోక్సో చట్టం, విద్యార్థుల ప్రవర్తన నియమాలు, సోషల్ మీడియా ప్రభావం, మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై వివరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు.
మహిళల భద్రత కోసం ప్రతిరోజూ బస్టాండ్, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా మహిళలు లేదా విద్యార్థులను వేధింపులకు గురిచేస్తే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
మహిళలకు ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100/112కు, ఆన్లైన్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం టి-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ ఎలిజబెత్ రాణి, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
