గంగా నగర్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు
ప్రత్యేక దృష్టి సారించి సమస్యలన్నీ పరిష్కరిస్తాం…
— మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : అభివృద్ధిలో వెనుకబడిన గంగా నగర్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆయన 5వ డివిజన్ గంగా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు పిచ్చి చెట్లు, రాకపోకలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులను చేపట్టారు. అనంతరం జరుగుతున్న పనులను మేయర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరానికి చివరన గంగా నగర్ ఉండటంతో ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. కొందరు స్థానికులు చెత్తను తీసుకువచ్చి బహిరంగ ప్రదేశాల్లో పారవేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని అన్నారు. రోడ్లు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల రాకపోకలకు, మురుగు నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
గంగా నగర్లో నెలకొన్న సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరించి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సహకారంతో రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మేయర్ తెలిపారు. డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
ప్రజలు కూడా నగరపాలక సంస్థకు సహకరించాలని మేయర్ కోరారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాటూరి సత్య ప్రసాద్, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఎస్ నవీన్, జూనియర్ అసిస్టెంట్ నాయిని చంద్రారెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్, వాటర్ సప్లై సూపర్వైజర్ శశికుమార్, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
