ప్రభుత్వ బడులపై పెరిగిన నమ్మకం.. 1,499 అదనపు అడ్మిషన్లు…
పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరగడం శుభపరిణామం….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగడం సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతోందనడానికి విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల నిదర్శనమని పేర్కొన్నారు.
2025-26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 31,140 మంది విద్యార్థులు నమోదు కాగా, 2026-27 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 32,639 మంది విద్యార్థులు చేరినట్లు కలెక్టర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు 1,499 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందారని, ఇది సుమారు 4.82 శాతం పెరుగుదల అని పేర్కొన్నారు.
కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, జడ్పీహెచ్ఎస్, ఎంపీపీ పాఠశాలలు తదితర ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత
ప్రభుత్వ విద్యా సంస్థలపై తల్లిదండ్రులు ఉంచుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించి వారు అన్ని రంగాల్లో రాణించేలా అవసరమైన ప్రోత్సాహం అందించాలని సూచించారు.
రాష్ట్రంలో రెండో స్థానంలో పెద్దపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగడం ప్రజల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతోందనడానికి నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవేశాల పెరుగుదలలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
