పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి
క్రైస్తవ సమాజ అభ్యున్నతికి పెద్దపీట…..
ఆత్మీయ సమావేశంలో మనాలి ఠాకూర్ హామీ…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ రామగుండం నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్టీపీసీలో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఆమె ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా సీపీఎఫ్ (చర్చ్ పాస్టర్ ఫెలోషిప్) లోగోను మనాలి ఠాకూర్ ఆవిష్కరించారు. అనంతరం పాస్టర్లతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాస్టర్లు వివరించిన సమస్యలను నోట్ చేసుకున్న ఆమె, వాటిని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు క్రైస్తవ సమాజ అభ్యున్నతికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
