ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం – బండి రమేష్
కూకట్పల్లి,
తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాంతం అంకితభావంతో పోరాడిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మూసాపేట్ ఆంజనేయ నగర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి బండి రమేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి, ప్రజల్లో ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని పెంపొందించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసి, గ్రామం నుంచి నగరం వరకు ప్రతి తెలంగాణవాసి హృదయంలో ఉద్యమ జ్వాలను రగిలించిన మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా చివరి శ్వాస వరకు అవిశ్రాంతంగా శ్రమించిన జయశంకర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కలలుగన్న సమానత్వ తెలంగాణను నిర్మించడం, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని బండి రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశాల్, సంతోష్, గోవింద్, బాలరాజు, నర్సింగరావు, ప్రభాకర్, సలీం, లక్ష్మీనారాయణ, యాదగిరి, ప్రకాష్, వాసు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
