రాయలసీమకు శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాల విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
– రాయలసీమ సాగునీటి సాధన సమితి
గురువారం నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
గత వారం రోజులుగా రాయలసీమలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి, సాగునీటి సంక్షోభంపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమితి విస్తృత ఉద్యమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రైతులు, ప్రజా సంఘాలతో కలిసి జలవనరుల శాఖ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
తీవ్ర కరువు పరిస్థితుల్లో రాయలసీమ ప్రజలు తాగునీటి కోసం, రైతులు ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ అత్యవసర సమస్యలపై రాజకీయ పార్టీలు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ చట్టబద్ధమైన జలహక్కులు రాజకీయాలకు అతీతమైన ప్రజా హక్కులని, వాటి సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి చేపట్టిన ప్రజా ఉద్యమానికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రారంభించడం హర్షణీయమైన పరిణామమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలు, రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ ప్రజానీకం, రైతాంగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, రాయలసీమకు చట్టబద్ధంగా కేటాయించిన జలహక్కులకు ఎలాంటి భంగం కలగకుండా నీటి విడుదలను నిరంతరం కొనసాగించాలని కోరారు. అలాగే పోతిరెడ్డిపాడు వ్యవస్థ, హంద్రీనీవా ప్రాజెక్టులో సంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, గుండ్రేవుల రిజర్వాయర్ వంటి కీలక మౌలిక సదుపాయాలను అత్యంత ప్రాధాన్యంతో పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ ప్రజాసంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, సాగునీటి సాధన సమితి సభ్యులు, ఉద్యమానికి అండగా నిలిచిన ప్రజలు, అలాగే రాయలసీమ జల సమస్యలను సమాజం ముందుకు తీసుకువచ్చిన మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాయలసీమ జలహక్కుల పరిరక్షణ కోసం సమితి ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, పట్నం రాముడు, జానోజాగో మహబూబ్ భాష,బిజ్జల కృష్ణమోహన్ రెడ్డి, న్యాయవాది అసదుల్లా, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
