విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెరగాలి.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి….
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు
మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు సూచనలు….
సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
రామగుండం పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు నశా ముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతో పాటు మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, సామాజిక మాధ్యమాల ప్రభావం, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు వివరించారు.
మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థల పరిసరాల్లో షీ టీమ్ నిరంతరం నిఘా నిర్వహిస్తోందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినా లేదా వేధింపులకు గురైనా భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
అలాగే అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం టి-సేఫ్ మొబైల్ అనువర్తనాన్ని వినియోగించాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజా, అధ్యాపకులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY