ప్రజల ఫిర్యాదులకు తక్షణ స్పందనే పోలీసుల ధ్యేయం….
బాధితులకు న్యాయం చేయడంలో రాజీ లేదు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…..
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
ప్రజల సమస్యలకు సత్వర, పారదర్శక, నిష్పక్షపాత పరిష్కారం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్ట ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్ కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండే, విశ్వాసాన్ని పెంపొందించే పోలీసు వ్యవస్థ నిర్మాణమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
