ప్రజావాణి అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…
పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారమే లక్ష్యం: అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, ఆయా శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సుల్తానాబాద్ మండలం తొగ్రాయి గ్రామానికి చెందిన ఈదునేరు పద్మ తన భర్త మరణించిన అనంతరం తన కుమారులు, కోడలు తనను పట్టించుకోవడం లేదని, తన భూమిని బలవంతంగా సాగు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన పద్మ తన భూమికి కార్పొరేషన్ బోరింగ్ మంజూరైన నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విద్యుత్ మోటార్ మంజూరు చేయాలని కోరగా, సోలార్ పంప్‌సెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని ఉద్యానవన శాఖ అధికారికి సూచించారు.
మంథనికి చెందిన ఆకుల సౌమ్య పట్టణంలోని పదో వార్డులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టును తనకు కేటాయించాలని వినతి సమర్పించగా, జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్దపల్లి మండలం రంగంపల్లికి చెందిన ఎం. జయశ్రీ తాను బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశానని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులో అవకాశం కల్పించాలని కోరగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ బి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
