వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలి…
అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి, : రామగుండం మున్సిపల్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి రామగుండం మున్సిపల్ పరిధిలోని 21వ డివిజన్ వీర్లపల్లి, ఓసీపీ–3 ప్రాంతం, 25వ డివిజన్లోని వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితులు, నీటి నిల్వలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్అండ్ఆర్ కాలనీలోకి వరద నీరు ఇళ్లలోకి చేరకుండా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు రూపొందించాలని సూచించారు.
ఓసీపీ–3 ప్రాంతంలో నిలిచిపోయిన వరద నీటిని యంత్రాల సహాయంతో అత్యంత వేగంగా తొలగించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి నిల్వల వల్ల ప్రమాదాలు సంభవించకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని, అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సేవలకు అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆర్ఎఫ్సీఎల్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
