రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సేవాభావానికి నిదర్శనం…..
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డు బుట్టి శ్రీనివాస్ కుటుంబానికి తోటి హోంగార్డులు మానవత్వాన్ని చాటుతూ రూ.49 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
గోదావరిఖని, రామగుండం సబ్‌యూనిట్లలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మొత్తం రూ.49,000లను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ సమక్షంలో మృతుడు శ్రీనివాస్ తల్లికి అందజేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డుల సేవాభావం, ఐక్యత అభినందనీయమని కొనియాడారు. కష్టకాలంలో సహచరుడి కుటుంబానికి చేయూత అందించడం పోలీసు కుటుంబంలోని పరస్పర సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేష్, ఆర్‌ఐ (హోంగార్డ్స్) పెద్దన్న, హోంగార్డులు నాథరి శ్రీనివాస్, ఇటిక్యాల సారయ్య, వేముల మహేందర్, ఎం.డి. ఆరిఫ్, సుద్దమల్ల మల్లేష్, మీస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
