ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర1 లక్ష్యాల సాధన
ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలి
విద్యార్థులు, యువత పరిశుభ్రతకు రాయబారులుగా మారాలి
కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, సమీప గృహాల నుంచి ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములవ్వాల్సిన ఉద్యమమని అన్నారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేయడం, సేంద్రియ వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఆహారాన్ని వృథా చేయకుండా ఉండటంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువత పరిశుభ్రతకు రాయబారులుగా ముందుండి తమ కుటుంబాలు, గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ‘ప్రతి ఇల్లు – ప్రతి వీధి – ప్రతి గ్రామం’ పరిశుభ్రంగా ఉండేలా అందరం కలిసి పనిచేద్దామని, మన వెంకన్నపురాన్ని ఆదర్శ పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, కొడవలూరు మండల అధ్యక్షుడు నాప వెంకటేశ్వర్ల నాయుడు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
