స్మశాన వాటికను ఆధునికీకరించాలి.. ‘
రూపాయి అంత్యక్రియల’ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి: సీపీఐ డిమాండ్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఖని స్మశాన వాటికను ఆధునికీకరించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిలిపివేసిన “రూపాయి అంత్యక్రియల” పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు డిమాండ్ చేశారు.
సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో స్మశాన వాటికను సందర్శించిన సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోశిక మోహన్, సీపీఐ నగర కార్యదర్శి కే. కనకరాజ్, సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ స్మశాన వాటిక నిర్లక్ష్యానికి గురై అధ్వాన్న పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గంగానగర్ ఫ్లైఓవర్ నుంచి స్మశాన వాటిక వరకు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్మశాన వాటికలో విద్యుత్ దీపాలు లేకపోవడం, చెట్లు, పొదలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు సంచరించే పరిస్థితులు ఏర్పడ్డాయని, వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో ఉన్న నీటి పంపులు పనిచేయకుండా ఉండిపోయాయని, రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ క్రిమేషన్ యంత్రం నిర్వహణ లేక తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుకుందని, దీంతో ప్రజాధనం వృథా అవుతోందని విమర్శించారు.
గతంలో అమలులో ఉన్న “రూపాయి అంత్యక్రియల” పథకాన్ని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిలిపివేశారని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.
అలాగే మంచిర్యాలలోని “మహాప్రస్థానం” తరహాలో ఆధునిక స్మశాన వాటికను నిర్మించడంతో పాటు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు మాటేటి శంకర్, శనిగరపు చంద్రశేఖర్, తొడుపునూరి రమేష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ కరీం, కలువల జగన్, పోతరాజు నాగరాజు, సాధుల శివ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
