వెదుళ్ళపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆకస్మిక తనిఖీ: నాసిరకం కోడిగుడ్లపై ఆగ్రహం
విద్యార్థుల సంక్షేమం మరియు విద్యా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు. బాపట్ల మండలం, వెదుళ్ళపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.
తనిఖీలో భాగంగా ఎమ్మెల్యే నేరుగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. చదువు ఎలా సాగుతోంది? ఉపాధ్యాయులు సరిగ్గా బోధిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాల పరిశుభ్రత మరియు మరుగుదొడ్ల నిర్వహణపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన క్రమంలో, విద్యార్థులకు ఇస్తున్న కోడిగుడ్లు పాడైపోయి ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. పిల్లల ఆరోగ్యంతో ఆటలాడుతున్న నిర్వాహకుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి, నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పాఠశాల ఆవరణ మరియు మరుగుదొడ్ల పరిశుభ్రతను ఎమ్మెల్యే స్వయంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మరియు పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో అశ్రద్ధ వహించకూడదని పాఠశాల సిబ్బందికి సూచించారు. “ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలి, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం మన బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY