ఘనంగా ‘షహీద్ దివస్’ పాదయాత్ర
అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న యువత
నెల్లూరు జిల్లా భారత స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల బలిదానాలను పురస్కరించుకుని సోమవారం నెల్లూరు నగరంలో ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యంలో ‘షహీద్ దివస్’ పాదయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు. నగరంలోని వి.ఆర్.సి సెంటర్ నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు ఈ యాత్ర ఉత్సాహభరితంగా సాగింది.కేవలం పాదయాత్రకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతను చాటుతూ తొలుత వి.ఆర్.సి మైదాన ప్రాంగణంలో పేరుకుపోయిన వ్యర్థాలను వాలంటీర్లు తొలగించారు. ‘పరిశుభ్రతే సేవ’ అనే నినాదంతో ప్రాంగణాన్ని శుభ్రం చేసిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. “దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తిని నేటి యువత గుండెల్లో నింపుకోవాలి. క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన యువతతోనే నవ భారత్ నిర్మాణం సాధ్యమవుతుంది. మేరా యువ భారత్ వేదిక ద్వారా యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి,” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి యువత, కేసిడిసి కళాశాల, రావుస్ కళాశాల, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు, మరియు మై భారత్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరవీరుల నినాదాలతో నెల్లూరు పురవీధులు మారుమోగాయి.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
