పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం లు ప్రార్థన చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం లు ప్రార్థన చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 4 ఇంక్లైన్ ఈద్గాను ఆయన సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈద్గా వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈద్గా ప్రాంగణంలో శుభ్రత, తాగునీటి సదుపాయం, లైటింగ్, పారిశుధ్య ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రంజాన్ పవిత్ర మాసం ముస్లిం లకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉందని, ఈ సందర్భంగా వారు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే ఎల్లప్పుడూ మైనార్టీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు.
అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలోని అన్ని ఈద్గాల అభివృద్ధికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, మసీదుల కమిటీ సభ్యులు, మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY