కొలనూరు ఆర్ఓబీ మంజూరు, ఓదేల ప్రాంతానికి కూడా సాధిస్తాం…
-ఎంపీ వంశీ కృష్ణ….
సాక్షిత పెద్దపల్లి // పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని తెలిపారు.
కొలనూరు, ఓదేల ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
రైల్వే అధికారులు కొలనూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తాను స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించానని, ఆ సమయంలో ఓదేల ప్రాంతానికి కూడా అత్యవసరంగా ఆర్ఓబీ అవసరమని వివరించామని ఆయన పేర్కొన్నారు.
మొదటగా రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే ఆర్ఓబీ మంజూరు చేసి, ఓదేల ప్రాంతానికి సాధ్యం కాదని తెలిపిందన్నారు, అయినప్పటికీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను నిరంతరం ప్రయత్నాలు కొనసాగించానని ఎంపీ వంశీ కృష్ణ తెలిపారు.
రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇచ్చిన ఫలితంగా కొలనూరు ప్రాంతంలో రైల్వే శాఖ స్వంత ఖర్చులతో ఆర్ఓబీ నిర్మాణానికి అంగీకరించిందని ఆయన చెప్పారు.
అదే విధంగా ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కొలనూరు గ్రామ ప్రజలకు ఆర్ఓబీ మంజూరు కావడం పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు. త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY