అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాము…
_ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి // 8ఇంక్లయిన్ కాలనీ: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించి, అభివృద్ధి పనులను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రామగుండం నియోజకవర్గంలోని 8 ఇన్‌క్లైన్ కాలనీ, 15, 19 డివిజన్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి సమస్యలు, మౌలిక వసతులు, డ్రైనేజీ, రహదారులు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన నీటి పంపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. దీని ద్వారా కాలనీ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ…
“మన వాడల్లో సమస్య వస్తే కేవలం ప్రజా ప్రతినిధుల కోసం ఎదురు చూడకుండా, మనమే భాగస్వాములై అధికారులతో మాట్లాడి పరిష్కారం కనుక్కుంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల భాగస్వామ్యంతో జరిగే అభివృద్ధి మాత్రమే స్థిరమైన అభివృద్ధి అవుతుంది” అని తెలిపారు.
ప్రజల సహకారం, ప్రభుత్వ మద్దతుతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి డివిజన్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ, మేయర్ మహంకాళి స్వామి ,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY