కె.ఆర్.ఆర్. అటానమస్ డిగ్రీ కళాశాలకు ఎన్‌సీసీ యూనిట్ మంజూరు

Sakshitha news

కె.ఆర్.ఆర్. అటానమస్ డిగ్రీ కళాశాలకు ఎన్‌సీసీ యూనిట్ మంజూరు

34 మంది విద్యార్థులకు తొలి విడతలో ప్రవేశాలు

సూర్యాపేట జిల్లా/కోదాడ, సాక్షిత :

కోదాడ పట్టణంలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలకు 2026-27 విద్యా సంవత్సరానికి ఎన్‌సీసీ (NCC) యూనిట్ మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హదసారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ 31 (టి) బెటాలియన్ పరిధిలో ఈ ఎన్‌సీసీ యూనిట్ పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ యూనిట్ ద్వారా మొత్తం 104 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుత విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి 34 మందికి ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్‌సీసీలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ నెల 7వ తేదీ శనివారం ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 1.2 కిలోమీటర్ల పరుగు పందెంతో పాటు ఇతర శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్గొండ బెటాలియన్ కమాండెంట్, కళాశాల ఎన్‌సీసీ కేర్‌టేకర్ ఆఫీసర్ టి. రాజు ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివరించారు.

ఎంపికకు హాజరయ్యే బాలురకు 5 అడుగుల 6 అంగుళాలు, బాలికలకు 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండాలని తెలిపారు. ఇతర వివరాల కోసం కళాశాలలోని ఎన్‌సీసీ కేర్‌టేకర్ ఆఫీసర్ టి. రాజును సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు.