ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు…

Sakshitha news

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు…

ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా…

చట్టప్రకారం తక్షణ చర్యలకు ఆదేశాలు….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని చట్టపరంగా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.

ప్రజావాణిలో భాగంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో ఫోన్‌లో మాట్లాడిన సీపీ ఆయా ఫిర్యాదుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, మధ్యవర్తులు, పైరవీకారులను ఆశ్రయించకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు పోలీస్‌ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ప్రజలకు మరింత చేరువగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.