నిర్మాణ రంగానికి, కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఉచిత ఇసుక విధానం.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు, రోజువారీ కూలీలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. బుచ్చిరెడ్డిపాళెంలో మీడియాతో మాట్లాడుతూ, ఇసుక సమస్యను భవన నిర్మాణ కార్మికులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రోజువారీ కూలీలు ఇప్పటికే తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి, నిబంధనలకు లోబడి ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం కల్పించారని చెప్పారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే ఇసుకను తరలించుకోవాలని, ఇందుకు ట్రాక్టర్లు, కూలీల సాయాన్ని మాత్రమే వినియోగించాలని సూచించారు. జేసీబీలు, టిప్పర్లు వినియోగించకూడదని, రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని స్పష్టం చేశారు.
నిబంధనలు పాటిస్తే అందరికీ ప్రయోజనం
కోవూరు నియోజకవర్గంలో ఉచిత ఇసుక విధానం సజావుగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే కోరారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. అవసరమైతే సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తారని చెప్పారు. ఉచిత ఇసుక విధానం వల్ల కార్మికులకు, నిర్మాణ రంగానికి మేలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, బుచ్చి అధ్యక్షులు గుప్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్, మరియు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
