విఐపీ భద్రతలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి….

Sakshitha news

విఐపీ భద్రతలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి….

ఆరోగ్యం, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యమే భద్రతా విధులకు బలం…..

—సీపీ అంబర్ కిషోర్ ఝా…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ విఐపీ భద్రతా విధుల్లో ఉన్న పిఎస్‌ఓలు అత్యంత అప్రమత్తతతో, క్రమశిక్షణతో, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో విఐపీ భద్రతా విధుల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, సమాచార మార్పిడి, సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన తదితర అంశాలపై పిఎస్‌ఓలకు సంక్షిప్త శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పిఎస్‌ఓలకు ఆరోగ్యం, శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మంచి అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ, విశ్వసనీయతతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

ప్రజలతో నేరుగా సంబంధం కలిగిన పిఎస్‌ఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, అక్రమ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బులు తీసుకోవడం పూర్తిగా తప్పని తెలిపారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టిలో పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అనూహ్య పరిస్థితులపై ఎల్లప్పుడూ అప్రమత్తత
విఐపీ భద్రతలో అనూహ్య పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయో ముందుగా చెప్పలేమని, అందువల్ల పిఎస్‌ఓలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, విధులకు సిద్ధంగా ఉండాలని సీపీ అన్నారు. పరిసరాలను నిశితంగా పరిశీలించడం, పరిస్థితిని అంచనా వేయడం, అవసరమైన సమయంలో తక్షణ నిర్ణయం తీసుకోవడం వంటి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

పోలీస్ శాఖలో పొందిన శిక్షణ, అనుభవం పిఎస్‌ఓలకు ప్రత్యేక బలమని తెలిపారు. కవాతు సాధన, కృత్రిమ విన్యాసాలు, నిరంతర శిక్షణ ద్వారా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. విధి నిర్వహణ సమయంలో పరిసరాలను నిరంతరం గమనిస్తూ అనుమానాస్పద కదలికలు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

విఐపీ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, సామాజిక మాధ్యమాల్లో అనధికారికంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోరాదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో శాఖా నియమావళికి అనుగుణంగా ప్రశాంతంగా, వేగంగా స్పందించాలని తెలిపారు.

“ప్రతి క్షణం అప్రమత్తత.. ప్రతి చర్యలో క్రమశిక్షణ.. ప్రతి నిర్ణయంలో బాధ్యత”
విఐపీ భద్రతలో ప్రతి క్షణం అప్రమత్తత, ప్రతి చర్యలో క్రమశిక్షణ, ప్రతి నిర్ణయంలో బాధ్యత ఉండాలని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. శిక్షణలో భద్రతా విధులు, శారీరక దారుఢ్యం, అప్రమత్తత, సమాచార మార్పిడి, సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, సమాచార గోప్యత, వృత్తి నైపుణ్యం తదితర అంశాలపై పిఎస్‌ఓలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేష్, ఆర్‌ఐలు శేఖర్, దామోదర్, రమేష్, మల్లేశం, సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top