శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు…
చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి….
–రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : శాంతిభద్రతల పరిరక్షణలో, చట్టాల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పుష్పగుచ్ఛం అందజేసి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఏసీపీ కార్యాలయంలోని వివిధ రికార్డులను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు.
డివిజన్ పరిధిలో దర్యాప్తులో ఉన్న కేసులు, వాటి పురోగతి, నిందితుల అరెస్టులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను ఏసీపీ రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా
రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సీపీ ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సివిల్, భూ వివాదాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోకుండా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడంతో పాటు ప్రతి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ అనంతరం పోలీసు అధికారులతో కలిసి ఏసీపీ కార్యాలయ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని సబ్‌డివిజన్‌కు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
