సామూహిక వరలక్ష్మీ వ్రతానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి….
కుల, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యం….
–విశ్వహిందూ పరిషత్…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని// : విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 21న శ్రావణమాసం రెండో శుక్రవారం సామూహిక శ్రీ వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక శ్రీ కోదండ రామాలయంలో కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి శశిధరాచార్యులు, విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మునగాల సంపత్, ఉపాధ్యక్షురాలు అరెల్లి మమత మాట్లాడుతూ.. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రావణమాసం రెండో శుక్రవారం మహిళలతో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని మహిళలు, మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కులం, వర్గం, వర్ణం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా హిందూ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే సామూహిక వరలక్ష్మీ వ్రతం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. శ్రావణమాసం పవిత్రమైనదని, వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. మహిళలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం పలికింది.
ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మునిగాల సంపత్, ఆలయ ప్రధాన పూజారి శశిధరాచార్యులు, కొండపర్తి లింగన్న, రాజమల్లు, రాజిరెడ్డి, ఉపాధ్యక్షురాలు అరెల్లి మమత, కోట తిరుమల, లలితమ్మ, భవాని, శ్రీజ, వీణ, ఇందిర, స్వాతి, లత, సాయిలు తదితరులు పాల్గొన్నారు.


