పెండింగ్ కేసులు వేగంగా పూర్తి చేయాలి…..
విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం….
–సీపీ అంబర్ కిశోర్ ఝా….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, బెల్లంపల్లి/
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి సబ్-డివిజనల్ (ఏసీపీ) కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ పోలీస్ కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం కార్యాలయ ఆవరణ, వివిధ విభాగాల రికార్డులను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలో దర్యాప్తులో ఉన్న కేసులు, వాటి పురోగతి, నిందితుల అరెస్టులు, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద నమోదైన కేసులు, పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పెండింగ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, సివిల్ భూ వివాదాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోకుండా చట్టపరమైన విధానాల ప్రకారమే వ్యవహరించాలని ఆదేశించారు. రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సీపీ పేర్కొన్నారు.
తనిఖీ అనంతరం పోలీస్ కమిషనర్ పోలీసు అధికారులతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


