రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి….
లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్….
సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి, లక్షెట్టిపేట/
రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పరిపాలనా విధులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో నమోదయ్యే భూ, ఆస్తి సంబంధిత వివాదాల ఫిర్యాదులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు. భూ హక్కులకు సంబంధించిన అంశాల్లో రెవెన్యూ శాఖ అధికారుల నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ స్వాగత కేంద్రంలో ప్రజలకు మరింత పారదర్శకంగా, సత్వర సేవలు అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.


