రైతులకు సాగునీరు, ఎరువుల కొరత రానివ్వం
ఎస్సారెస్పీ కాలువలకు బుష్ క్లియరెన్స్ పూర్తి చేసి త్వరలోనే నీటి విడుదల
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.. శాస్త్రీయ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి : ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
– పెద్దపల్లి జిల్లా ప్రతినిధి | సుల్తానాబాద్ |
రైతులకు సాగునీరు, ఎరువుల సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్న ఆయన రైతు సంక్షేమం, సాగునీటి నిర్వహణ, వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అవసరానికి మించి యూరియా, డీఏపీ ఎరువులు వినియోగించడం వల్ల భూముల సారవంతత తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమతుల్య ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతు వేదికల ద్వారా శాస్త్రీయ సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
గత యాసంగి సీజన్‌లో యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం అమలు చేయడం ద్వారా ఎరువుల వినియోగం క్రమబద్ధీకరించబడిందని, భూముల సారం మెరుగుపడి ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడులు నమోదయ్యాయని తెలిపారు.
ప్రస్తుతం మహారాష్ట్రలోని ప్రాజెక్టులు 80 శాతానికి పైగా నిండాయని, త్వరలోనే ఎస్సారెస్పీ కాలువల్లో నీటి విడుదల జరిగేలా ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ప్రాంత రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఎస్సారెస్పీ ప్రధాన, ఉప కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా వెంటనే బుష్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి విడుదలకు ముందే కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కాలువల శుభ్రత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సాగునీరు రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే మార్చి రైతులు, గృహ వినియోగదారులు, పరిశ్రమలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్‌రావు, ఎంపీడీవో దివ్య దర్శన్‌రావు, తహసీల్దార్ బషీరుద్దీన్, డీఎల్‌పీఓ దేవకీదేవి, మండలంలోని సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


