గిరిజన యువతకు బంగారు అవకాశం – ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ….
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:,
తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన అర్హులైన నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమాచార సాంకేతిక సేవలు, సరుకు రవాణా నిర్వహణ, టెలికాం, వ్యవసాయం, గృహోపకరణాల నిర్వహణ, దుస్తుల తయారీ, అందం మరియు సంరక్షణ, పర్యాటకం, అతిథ్య రంగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
శిక్షణ పూర్తిచేసిన అర్హులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కరీంనగర్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. అదేవిధంగా మరిన్ని వివరాల కోసం 94411 74822 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.

