జిల్లాలో సజావుగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

Sakshitha news

జిల్లాలో సజావుగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..

  • ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23వ తేదీన ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయి. పరీక్షల మొదటి రోజు నుంచే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని, ఉత్సాహంగా పరీక్షలు రాస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, అవసరమైన మౌలిక వసతులు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధ‌న‌ల మేర‌కు జరుగుతున్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు.

పరీక్షా కేంద్రాల వ‌ద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, స‌రైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ త‌దిత‌ర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా హాళ్లలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫ‌స్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయా అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రశ్నపత్రాల రవాణా, భద్రపరచడం వంటి అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ల‌క్ష్మీశ ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 36,928 మంది మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థుల‌కు 98 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఉద‌యం 9 గం. నుంచి మ‌ధ్యాహ్నం 12 గం. వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. జిల్లా ఇంట‌ర్మీడియెట్ విద్యాధికారి బి.ప్ర‌భాక‌ర‌రావు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షిస్తూ స‌జావుగా జ‌రిగేలా చూస్తున్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Scroll to Top