అనుమానంతో భార్యపై రోకలిబండతో దాడి
చిలకలూరిపేట (రూరల్): భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న భార్యనే చంపాలనే ఉద్దేశంతో రోకలిబండతో తలపై బాదిన ఘటన చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్ రాజు తన భార్య పుష్ప (34) ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 01:00 గంట సమయంలో సల్మాన్ రాజు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. గాఢనిద్రలో ఉన్న పుష్పను చంపాలనే ఉద్దేశంతో, ఇంట్లో ఉన్న రోకలిబండతో ఆమె తలపై బలంగా కొట్టాడు.
తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్ళిన పుష్పను కుటుంబ సభ్యులు వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు సర్వజన ఆసుపత్రి (GGH)కి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె GGHలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం.బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ శ్రీ జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండటం, తండ్రిపై కేసు నమోదు కావడంతో ఆ పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
