చివ్వెంల మండలంలో భారీ విధ్వంసం
బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ యూనిట్లో ఘోర పేలుడు
….
సాక్షిత చివ్వెంల : తెల్లవారుజామున 6:40 గంటల సమయంలో చివ్వెంల మండలంలోని బిబిగూడెం సమీపంలో ఉన్న బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఫోమ్ తయారీ కోసం ఉపయోగించే భారీ పీడన ఫోమ్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో పరిసర ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఘోర గర్జనతో జరిగిన ఈ పేలుడు శబ్దం బిబిగూడెం, మున్యా నాయక్ తండ, చివ్వెంల గ్రామాల వరకు వినిపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
దట్టమైన దుమ్ము మేఘాలు ఆకాశాన్ని కప్పేసి, పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వరుసగా కంపనాలు నమోదయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే ఒక కిలోమీటర్ దూరం వరకు ట్యాంక్ శకలాలు ఎగిరి పడ్డాయి. పరిశ్రమ ప్రహరీ గోడ పూర్తిగా ధ్వంసమై, పిల్లర్లు విరిగిపడి, పక్కన ఉన్న చెట్లు ఇటుకల్లా విరిగిపోయాయి. సిమెంట్ బ్లాక్లు, ఐరన్ శకలాలు దూరంగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే మరింత సమాచారం కోసం అధికారులు పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? పేలుడు కారణమేంటనే దానిపై స్థానికులలో చర్చ నడుస్తోంది. ఈ ఘటనపై అధికారుల పూర్తి నివేదిక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
