అన్నదాతలను కాంటాల పేరుతో మోసం చేస్తున్న “మ్యాక్స్” దాన్యం కొనుగోలు కేంద్రాలు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: రైతులు చదువు లేనివారైతే చాలు,అమాయకులను..అదును చూసి కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తమకు ఇష్టం వచ్చినట్లుగా కాంటాలు వేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం పోలిస్టేషన్ పక్కన గల మ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కాంటాలలో నిలువు దోపిడి మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారులు పలుమార్లు నిర్వాహకులకు కేంద్రాల నిర్వహణపై అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అదేదీ తమకు పట్టనట్లుగా మాక్స్ (MACS) ధాన్యం కొనుగోలు నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రైతుల, అధికారుల కండ్లుగప్పి… ఈ తంతు జరిగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తా తూకంతో కలిపి 40 కేజీల 700 గ్రాములు వేయవలసిఉండగా ఆ కేంద్రంలో మాత్రం 41 కేజీ 550 గ్రాములు ధాన్యం కాంటా వేస్తున్నారు. ఇదేమని నిర్వాహకులను అడిగితే అక్కడ ఉన్నవాళ్లు తమ ఇన్చార్జి లేడు అని ఒక మాట.. తమకు తెలుసు ఎంత వేయాలో అని మరొక మాట ఇలా పొంతనలేని సమాధానం ఇస్తున్నారు. ఈ విధంగా రైతులను మోసం చేస్తున్న ఇలాంటి కేంద్రాలను సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించక పోవడంతో వీళ్ళ ఆగడాలకు అడ్డు,అదుపు లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి వారికి మరోసారి కేంద్రాల నిర్వహణ బాధ్యత ఇవ్వద్దని చెబుతున్నారు.
తహసిల్దారు వివరణ
ఈ విషయమై స్థానిక తహసిల్దారు శ్రీనివాస్ ను వివరణ కోరగా తాము అప్పుడప్పుడు కేంద్రాలను తనిఖీ చేస్తున్నామని ఈ విషయం తమ దృష్టికి రాలేదనీ తాము తనిఖీ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగిన తక్షణమే చర్యలు తీసుకొని అలాంటి వారికి భవిష్యత్తులో కేంద్రాల నిర్వహణ బాధ్యతలు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
మాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు సాంబారెడ్డి వివరణ
ఈ విషయమై కేంద్రం నిర్వాహకులు సాంబారెడ్డిని వివరణ కోరగా తాను కేంద్రం వద్ద లేనని తెలిపారు.తమ సహానిర్వాకులు చూసుకోవడం జరిగిందని తెలిపారు ఒకటి,రెండు బస్తాలు అలా జరగడం సహజం అని తెలిపారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో అనేకరకాలుగా అన్నదాతలే ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప మరెవరికీ ఎలాంటి నష్టం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మిల్లులను సందర్శించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
