బ్యాంకుల జాతీయం… ఇందిరాగాంధీ చలవే
** ఇందిరమ్మ జయంతి వేడుకలో యార్లపల్లి గోపి
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: దేశంలో బ్యాంకులను కేంద్రప్రభుత్వ పరిధిలోకి జాతీయం చేసిన మహోన్నత మహిళా శిఖామణి స్వర్గీయ ఇందిరాగాంధీ అని తిరుపతి నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు యార్లపల్లి గోపి తెలిపారు. స్థానిక సంజయ్ గాంధీ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు యార్లపల్లి గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం విలయ తాండవం చేస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆదుకున్న దార్శనిక మహిళా నేత ఇందిరమ్మ అన్నారు.
రాజభరణాలను రద్దు చేసి, గరీబ్ హటావో నినాదంతో పేదరికాన్ని నిర్మూలించి, సమాజంలో అసమానతల ను తగ్గించడానికి కృషి చేసిన మహోన్నత నాయకురాలు అని కొనియాడారు. అదేవిధంగా దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి పేదల ఆకలి మరణాలను నివారించి గొప్ప రాజకీయ వేత్తగా మారారని పేర్కొన్నారు. ఇవే కాకుండా 20 సూత్రాల కార్యక్రమం, బ్యాంకులను జాతీయం చేయడం, 1971లో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన అపర కాళీ అని, దేశంలో తొలిసారిగా అణు ఆయుధ పరీక్షలు చేసి భారత రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయడం ఇందిరమ్మకే సాధ్యమయిందని చెప్పారు. 1975లో తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం చేసి భారత సత్తాని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు. భారతరత్న పొందిన తొలి మహిళా ప్రధాని కూడా ఇందిరా గాంధీ ఒక్కరే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బి.రవి, నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సమీనుల్లా, ఎం.తేజోవతి, శాంతియాదవ్, కుమార్ గౌడ్, బాల గురవయ్య, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
