పెద్దశేష వాహనంపై సిరులతల్లి అభయం
** శోభాయమానంగా తిరుచానూరు బ్రహ్మోత్సవం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం ఏడు తలలు కలిగిన పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో సిరులతల్లి భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఈ వాహన సేవల్లో భక్తులు అడుగడుగునా కొబ్బరి కాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. అలాగే పాలు, నీళ్లు వేరుచేసే శక్తి ఉన్న హంసను వాహనంగా చేసుకున్న శ్రీవారి దేవేరి మనుషుల్లోని కల్మషాన్ని వేరుచేసి స్వచ్ఛమైన భక్తిని నింపడమే హంస వాహనం ప్రత్యేకత.
కాగా వాహన సేవల్లో తిరుమల శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి.మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, పలువురు అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
