అధికార్లందరూ అందుబాటులో ఉండాలి
** కమిషనర్ మౌర్య ఆదేశం
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అల్పపీడనంతో కురుస్తున్న వర్షాల్లో నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాయం అందించేందుకు అన్ని విభాగాల మున్సిపల్ అధికారులు అందుబాటులో ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో బుధవారం కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఇంకా రెండు రోజులు నగరంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సాయం అందించేందుకు అందరు అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యాలయంలో 24గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్లు 0877 222356776, 90008 22909 లో అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు. వర్షాల వలన త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని కోరారు. పరీక్షలు నిర్వహించి, క్లోరినేషన్ చేయాలనీ తెలిపారు. ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు గుంతలు పడితే, వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మురికినీటి డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలన్నారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తే బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లపైన చెత్త కుప్పలు, బురద తొలగించి బ్లీచింగ్ వేయాలని సూచించారు. ఎక్కడైనా చెట్లు పడేలా ఉన్నా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా కంట్రోల్ సెంటర్ ను సంప్రదించాలని తెలిపారు. పురాతన భవనాల్లో నివాసం ఉండొద్దని ప్రజలకు సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
