రైతు ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం
** రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
సాక్షిత ప్రతినిధి – అమరావతి: రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట సాగుచేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలతకు కట్టుబడి ఉంది. రైతు అభ్యున్నతే మా లక్ష్యం. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని, ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయకంగా మారాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక దిశానిర్దేశాలు ఇచ్చారు. రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
