బీఆర్ఎస్ కాసుకో..
వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిటే
- పోయిన ఎన్నికల్లో 39ఉన్న ఆ పార్టీ సీట్లు ఈసారి పడిపోవడం ఖాయం
- కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే.. విషం చిమ్ముతున్న విపక్షాలు
- ధనిక రాష్ట్రంలో సంక్షేమాన్ని అప్పటి దొర పట్టించుకోక.. ఇప్పుడు సిగ్గుతో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు
- రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి విమర్శలు
- కల్లూరులో 1,516 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
కల్లూరు: గత పాలకుల వైఫల్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్నా.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ.. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తమ ప్రభుత్వంపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కల్లూరు లోని వీఆర్ కే ఫంక్షన్ హాల్ లో చేయూత పథకం కింద కల్లూరు మున్సిపాలిటీ, మండల పరిధిలోని 1,516 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను.. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సభలో మంత్రి పొంగులేటి ప్రసంగిస్తూ.. అప్పటి ధనిక రాష్ట్రంలో నాటి పాలకులు లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు.
ఇప్పుడు మా ప్రజా పాలనలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 4.50 లక్షల మందికి చేయూత పింఛన్లు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, 73,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలు వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ. 500 బోనస్, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు… ఇలా పేదల మనసెరిగిన పాలనను చూసి విపక్షాలు ఓర్వలేక విషం చిమ్ముతున్నాయని విమర్శించారు. అప్పుడేమో పేదలకు సంక్షేమం అందించలేక..సిగ్గుతో ఇప్పుడు దొర ఫాంహౌస్ కే పరిమితమయ్యాడని తెలిపారు. “ఇక.. బావ బామ్మర్దులేమో నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలతో రెచ్చిపోతున్నారని.. తలకిందకి, కాళ్లు పైకెత్తినా.. పొర్లు దండాలు పెట్టినా.. ఈసారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమవుతారు” అని పునరుద్ఘటించారు.
ఈ కార్యక్రమంలో..: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మార్కెట్ చైర్మన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కస్తాల నరేందర్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST