గాంధీ శిల్ప బజార్‌కు విశేష స్పందన..
- దేశవ్యాప్త హస్తకళా ఉత్పత్తులు ఒకే వేదికపై
- ప్రదర్శన, అమ్మకాలు మరో నాలుగు రోజులే
- ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలి: లేపాక్షి వీసీ, ఎండీ ఎం.విశ్వ
దేశ సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన చేనేత, హస్తకళా ఉత్పత్తుల విశిష్ట సంపదను భావితరాలకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా నగరంలో ఈ నెల 10న ప్రారంభించిన గాంధీ శిల్ప బజార్‌కు విశేష స్పందన లభిస్తోందని.. దేశవ్యాప్త హస్తకళా ఉత్పత్తులు ఒకే వేదికపై అందుబాటులో ఉన్న శిల్ప బజార్ ఈ నెల 19వ తేదీ వరకు మరో నాలుగు రోజులే అందుబాటులో ఉంటుందని, ఔత్సాహికులు సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని లేపాక్షి వీసీ, ఎండీ ఎం.విశ్వ బుధవారం తెలిపారు.
విజయవాడ పటమట ఎన్‌టీఆర్ సర్కిల్ సమీపంలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో అఖిల భారత హస్తకళా వస్తువులు, కళాత్మక వస్త్ర ప్రదర్శన, అమ్మకం వేదిక గాంధీ శిల్ప బజార్‌లో దేశ వ్యాప్తంగా హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కమిషనర్ సహకారంతో నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్‌లో మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, గద్వాల్, సిద్దిపేట్, నారాయణపేట్, చీరాల, కలంకారి, బాటిక్ ప్రింటింగ్, బెంగాలి కాటన్, కాశ్మీరి సిల్క్, కోసా సిల్క్, మధురై, లక్నో చికన్ వర్క్, నారాయణవరం, గాగ్రా చోళి, కాటన్ ప్రింటెడ్, సంబల్పూర్, కోసా (టస్సర్), ఆప్లిక్ వర్క్, ప్యాచ్ వర్క్, ఖాదీ మెటీరియల్, బెడ్ షీట్స్ వంటివి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాంధీ శిల్ప బజార్ అందుబాటులో ఉంటుందని, రూ. కోటి విలువైన అమ్మకాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ. 40 లక్షల విలువైన వస్తువులను ఔత్సాహికులు కొనుగోలు చేసినట్లు లేపాక్షి వీసీ, ఎండీ ఎం.విశ్వ వెల్లడించారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
